పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 2, 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులను స్మరించారు. కార్యక్రమంలో మాట్లాడిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అలాగే గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి గ్రామ ప్రజల తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.