11 కేవీ విద్యుత్ లైన్, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తుల ఆందోళన

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: పెద్దమందడి పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థల సర్వే నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనం లేకపోవడంతో గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2026 సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో, బుధవారం ఆర్‌ఐ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఈ సర్వేను పలువురు గ్రామస్తులు పరిశీలించారు. అయితే సర్వే చేసిన స్థలంపై గ్రామస్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థలం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు పలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా గ్రామం నుంచి వచ్చే డ్రైనేజీ ప్రవాహం, 11 కేవీ విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ వైర్లు, రైతుల పంట పొలాలకు వెళ్లే దారులు, గతంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ తదితర అంశాలు భవిష్యత్‌లో ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకంగా డ్రైనేజీ సమస్య కారణంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో అధికారులు, సిబ్బంది అక్కడ విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చని గ్రామంలో చర్చ జరుగుతోంది. గ్రామపంచాయతీ భవనం నిర్మాణం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని, స్థలాన్ని ఎంపిక చేసే ముందు విద్యుత్ లైన్లు, డ్రైనేజీ, రాకపోకల మార్గాలు, తాగునీటి వసతులు తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి వైపు అనువైన స్థలాన్ని పరిశీలించి, ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతంలో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తే భవిష్యత్‌లో మరింత ఉపయోగకరంగా ఉంటుందని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అన్ని సౌకర్యాలను పరిశీలించిన అనంతరం అధికారులు తుది స్థలాన్ని ఎంపిక చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.