
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*మున్సిపల్ స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు: 25 సెంట్ల రిజర్వుడ్ స్థలం కబ్జాకు యత్నం*
చిలకలూరిపేట పట్టణం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. ఏకంగా మున్సిపాలిటీకి చెందిన రిజర్వుడ్ స్థలాన్నే కాజేసేందుకు కొందరు అక్రమార్కులు యత్నించడం పట్టణంలో సంచలనంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా విలువచేసే ఈ 25 సెంట్ల స్థలం చుట్టూ జరుగుతున్న వివాదాలు, తెరవెనుక రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
*ఏఎంజీ దానం..అక్రమార్కుల పన్నాగం*
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ప్రజోపయోగం కోసం నిర్దేశించిన ఈ రిజర్వుడ్ స్థలాన్ని గతంలో కార్మికుల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం నిమిత్తం ఏఎంజీ (AMG) స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. హెచ్.హెచ్. డ్రైక్ మెన్ నగర్ లోని ఈ ప్రాంతంలో కొంతకాలం పాటు డే-కేర్ సెంటర్ కూడా నడిచింది. అయితే, ఏఎంజీ సంస్థ ఈ స్థలాన్ని ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులకు దానంగా ఇస్తూ పత్రాలు రిజిస్టర్ చేయడంతో వివాదం మొదలైంది. మున్సిపల్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి!
*తప్పుడు సర్వే నంబర్లతో మాయాజాలం!*
అక్రమార్కులు కేవలం రిజిస్ట్రేషన్ తోనే ఆగలేదు. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి ఈ 25 సెంట్ల భూమిని ఏడు ప్లాట్లుగా విభజించి రిజిస్టర్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఎంజీ పేరుతో మున్సిపాలిటీ జారీ చేసిన పన్ను రశీదులు, తహశీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. దీని వెనుక కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి.
*బోర్డులతో హెచ్చరికలు.. డాక్యుమెంట్ల రద్దు!*
విషయం పత్రికల ద్వారా బహిర్గతం కావడంతో మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు మేల్కొన్నారు. ఆ స్థలం మున్సిపాలిటీదేనని, ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో, ఏఎంజీ సంస్థ తాము చేసిన దాన దస్తావేజులను సోమవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దు చేసుకుంది. ఏడు డాక్యుమెంట్లను రద్దు చేయడంతో ఈ వివాదం కీలక మలుపు తిరిగింది.
సోషల్ మీడియాలోనూ నిరసన సెగ
ఈ కబ్జా యత్నాలపై సోషల్ మీడియాలోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చిలకలూరిపేట ఫేస్ బుక్ పేజీల్లో.. ఆక్రమణతో షాపులు కడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని” డిమాండ్ చేస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నెటిజన్లు గొంతెత్తుతున్నారు.
*అధికారుల నిర్లక్ష్యమా? అండదండలా?*
ఇంత జరుగుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు మొదట్లో చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరించారనేది పెద్ద ప్రశ్న. ఏఎంజీ సంస్థకు అక్రమంగా మేలు చేకూర్చేందుకే అధికారులు ఈ తతంగం నడిపించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తావులేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.