POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 8:21 am Posted by : POLITICAL POWER

చేతగాని నాయకత్వం వల్లే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జాప్యం

జర్నలిస్టుల పాదయాత్రకు యూనియన్లకతీతంగా పెరుగుతున్న మద్దతు

ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్

ఇప్పటికైనా జర్నలిస్టు సంఘాల నాయకత్వం కలిసి రావాలి

మౌనం వీడి పోరాటానికి బలం చేకూర్చాలని పిలుపు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: మ్మం జిల్లా జర్నలిస్టుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల సాధన కోసం చేపడుతున్న పాదయాత్రకు యూనియన్లకతీతంగా జర్నలిస్టుల నుంచి మద్దతు పెరుగుతోందని ఉద్యమకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీలు ఇస్తూ, సభలు, సమావేశాలు నిర్వహించి జర్నలిస్టులను వివిధ సందర్భాల్లో ఉపయోగించుకున్న నాయకులు ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాలని కోరారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ న్యాయమైనదేనని, ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరడం తప్పు కాదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై గతంలో కూడా అనేక సందర్భాల్లో నిరసనలు, సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 2025 జనవరి 26న ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్‌లో సుమారు 200 మంది జర్నలిస్టులతో ఇళ్ల స్థలాల సమస్యపై నిరసన చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటినుంచి ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు కలిసి వస్తే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ రౌండ్ టేబుల్ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు జర్నలిస్టుల పోరాటానికి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ, కొందరు నాయకత్వాలు ఇంకా మౌనం వీడకపోవడం విచారకరమని విమర్శించారు. నాయకత్వం వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సైతం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నప్పటికీ, ఆ దిశగా నాయకత్వాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదని ఉద్యమకారులు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రలో వివిధ యూనియన్లకు చెందిన సీనియర్ జర్నలిస్టులు స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారని తెలిపారు. ఇది జర్నలిస్టులందరి సమస్యగా గుర్తించి అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. “ఇళ్ల స్థలాలు సాధించేంతవరకు పోరాటం ఆగదు. అవసరమైతే మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం. జర్నలిస్టుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టు సంఘాల నాయకత్వాలు మౌనం వీడి, స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి ఇళ్ల స్థలాల సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. జర్నలిస్టుల ఐక్యతతోనే చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.