విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై తనిఖీ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బుక్స్ గోదాంను సీజ్ చేసిన ఎంఈఓ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 19 2026: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు మరియు ఇతర స్టేషనరీ సామగ్రిని విక్రయించేందుకు ప్రత్యేకంగా గోదాంను ఏర్పాటు చేసిన సత్తుపల్లి నియోజకవర్గంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై స్పందించిన సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రాజేశ్వరరావు పాఠశాలను తనిఖీ చేసి, అక్రమంగా నిర్వహిస్తున్న బుక్స్ గోదాంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్, జార్జి రెడ్డి పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎస్. మందా సురేష్, బి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు దాసరి రాజశేఖర్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యాసంస్థలే విద్యార్థులకు బలవంతంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, స్టేషనరీ సామగ్రి విక్రయించడం అనైతిక చర్య అని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేస్తూ పుస్తకాలు, యూనిఫాంలు మరియు ఇతర విద్యా సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నాయని వారు ఆరోపించారు. ఇటువంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ( ఆర్ టి ఈ Act) మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి చిలుముల అజయ్, విద్యార్థి సంఘ నాయకులు సాయి, బాలాజీ, రాము తదితరులు పాల్గొన్నారు.