Date of Publish : 23 September 2026, 8:37 pmPosted by : POLITICAL POWER
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.
అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది.
యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. జేఏసీతో కలిసి నడుద్దాం.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జేఏసీ ప్రధాన లక్ష్యం.
-వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. రవికుమార్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏ ఒక్క జర్నలిస్టు యూనియన్‌కు పరిమితం కాకుండా, అన్ని యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని వనపర్తి జిల్లా జేఏసీ అధ్యక్షుడు జి. రవికుమార్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా జి. రవికుమార్ ను నియమించారు.ఈ నియామకాన్ని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోగరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా వనపర్తి అధ్యక్షులు జి.రవికుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టుల మధ్య యూనియన్లు, సంస్థలు వేరైనా సమస్య వచ్చినప్పుడు జర్నలిస్టులందరూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత, సంస్థాగత, యూనియన్ విభేదాలకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై జేఏసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. “జేఏసీ ఎవరి యూనియన్‌కు పోటీ కాదు.. ఏ యూనియన్‌కు ప్రత్యామ్నాయం కాదు. అన్ని యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సమన్వయ వేదిక. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత విషయంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే మా లక్ష్యం” అని జి. రవికుమార్ తెలిపారు. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు, బస్‌పాస్‌లు, వృద్ధాప్య భద్రత, ఉద్యోగ భద్రత, జర్నలిస్టుల సమస్యలు తదితర అంశాలపై పార్టీలకు, యూనియన్లకు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వనపర్తి జిల్లాలోని 15 మండలాలు, పట్టణ,వివిధ మండల ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. “జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉంటేనే సమస్యలపై బలమైన గొంతు వినిపించగలం. ఎవరు ఏ యూనియన్‌లో ఉన్నారన్నది కాదు.. జర్నలిస్టు సమస్య ఎదుర్కొంటున్నాడా లేదా అన్నదే జేఏసీకి ముఖ్యం. జర్నలిస్టులందరికీ జేఏసీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు. అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సమిష్టిగా ముందుకు వచ్చి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని జి. రవికుమార్ పిలుపునిచ్చారు.