POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:07 pm Posted by : POLITICAL POWER

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్ల లో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల-మదిగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులత కూడా పాల్గొన్నారు. అతిథులు పాఠశాలకు చేరుకోగానే ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు, ఉపాధ్యాయులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం అందించారు. ముందుగా సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం కంప్యూటర్ ప్రయోగశాల, విజ్ఞానశాస్త్ర ప్రయోగశాల, గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. మైక్రోస్కోప్ ద్వారా కణజాల పరిశీలన, డీఎన్ఏ నమూనా అధ్యయనం, భౌతిక మరియు రసాయన శాస్త్ర ప్రయోగాలపై ఉపాధ్యాయులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి ఆంగ్ల, తెలుగు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ప్రవేశించిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పరిశీలించిన డీఈఓ, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. బడి తోటలో పండించిన కూరగాయలతో వంటకాలు తయారు చేస్తున్నట్లు వంట సిబ్బంది తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో 60కు పైగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల, అమ్మపల్లి, మోజర్ల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, శశివర్ధన్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఈఓ యాదయ్య మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలపై అధిక వ్యయం చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య, జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులతలకు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.