Date of Publish : 21 September 2026, 11:43 amPosted by : POLITICAL POWER
జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026:పెద్దమందడి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి విడుదల కోసం ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు వెంటనే కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించి, సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు పెద్దమందడి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జూరాల ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించకుండా ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు జూరాల కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.