POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 2:42 pm Posted by : POLITICAL POWER

జైపాల్ రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /  పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 28 2026: భారత రాజకీయాల్లో విలువలకు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఆయన సమాధి వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ… ఎస్. జైపాల్ రెడ్డితో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ రాజకీయ జీవితమంతా నిష్కళంకంగా సేవలందించిన మహానేతగా ఆయనను కొనియాడారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి జైపాల్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, వివిధ కీలక బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన నిబద్ధత, పార్లమెంటులో ప్రదర్శించిన వాగ్ధాటి, రాజకీయ విలువల పట్ల ఆయనకున్న అంకితభావం నేటి తరానికి ఆదర్శమని డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, వాటి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.