*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది. పలు భాషల్లో ఛానళ్లు నడుపుతుండడం వల్ల దానికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వుంది. టీవీ9 స్థాపకుడు సత్యం రామలింగరాజు సమీప బంధువైన సీని రాజు. కానీ కాలక్రమంలో చాలా మార్పులు జరిగి, మెగా కృష్ణారెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు టీవీ9 సొంతదారులుగా మారారు. అప్పటి నుంచి వారి రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వార్తలు ప్రసారం చేస్తున్నది. యజమానులు ఇద్దరూ అపర కుబేరులు; వారికి లేని వ్యాపారం లేదు. ప్రభుత్వాలతో, ప్రభుత్వాలను నడిపే నేతలతో నిత్య సంబంధాలు తప్పనిసరి. అందువల్ల టీవీ9 సంపాదక విధానాలు రాజకీయ కోణంలో ఒడిదుడుకులకు లోనవుతూ వస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహమూ, వైరమూ ఎప్పుడూ కొనసాగుతూనే వుంటుంది. యజమానులు చెప్పిన కోణంలోనే వార్తలు ప్రసారం చేయడం, వక్రీకరణ తప్పనిసరి కావడంతో ఇటీవల టీవీ9కు ప్రజల్లో ఆదరణ తగ్గింది. విశ్వసనీయత కోల్పోయింది. అయినా అగ్రస్థానంలోనే వుంది.
టీవీ9 ఔన్నత్యానికి కారకుడు రవి ప్రకాష్. ఒక్క ఈటీవీ మాత్రమే సంప్రదాయ పద్ధతుల్లో నడిచే రోజుల్లో, తెలుగు మీడియా రంగంలో ఒక విప్లవం సృష్టించాడు రవి ప్రకాష్ ఆయన నమూనాలో ఆ తర్వాత చాలా టీవీ ఛానళ్లు వచ్చాయి. కానీ ఏవీ కూడా ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. యాజమాన్యంతో విభేదాల వల్ల రవిప్రకాష్ సంస్థను వీడక తప్పలేదు. తమ సంస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ప్రతిభావంతుడిగా గౌరవించి, సగౌరవంగా సాగనంపాల్సిన యాజమాన్యం ఆయనను చిత్రహింసలు పెట్టింది. జైలు పాలు చేసింది. బతకడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు సృష్టించింది. యజమానులు మహాబలవంతులు కావడంతో రవి ప్రకాష్ ప్రతిఘటన సఫలం కాలేదు. ఒక్కటే గొప్ప విశేషం — యజమానుల ముందు తలదించకుండా, రాజీపడకుండా, తన జీవితం నాశనమైపోతుందని తెలిసినా పోరాటం కొనసాగించడం ద్వారా రవి ప్రకాష్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన చేతికింద నైపుణ్యం సాధించిన రజనీకాంత్ తదుపరి బాధ్యతలు స్వీకరించాడు. ఏ లోపం తలెత్తకుండా ఇన్నేళ్లపాటు నడిపిస్తున్నాడు. యజమానుల వ్యాపార పరిధుల లోపలే పని చేయవలసిన ఆంక్ష వున్నప్పటికీ, చూసేవారికి ఆ లోపం కనిపించకుండా వార్తల విశ్వసనీయతను నిలబెట్టడానికి రజనీకాంత్ పెద్ద కసరత్తు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వున్నట్లుండి అనిల్ ఇనగంటి అనే యువ పాత్రికేయుడిని టీవీ9 సంపాదక బాధ్యతల్లో కూర్చోబెట్టారు. తెలుగు దినపత్రికల రిపోర్టింగ్‌లో అద్భుత నైపుణ్యవంతుడిగా పేరు పొందిన ఆంధ్రజ్యోతి ఐ. వెంకట్రావు కుమారుడు అనిల్. అందువల్ల ఆయన నేపథ్యంలోనే పత్రికా వృత్తి ఇమిడి వుంది. గతంలో మహా న్యూస్ సిఇవోగా పనిచేశాడు. కొంతకాలం స్టూడియో ఎన్‌ను కూడా నడిపాడు. అనిల్ ఇనగంటి, తెలుగుదేశం నేత లోకేష్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన స్నేహితుడు; విధేయుడు కూడా. వేరే వ్యాపకం లేకుండా లోకేష్‌కు ఆత్మీయ అంతరంగిక బృంద సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. టీవీ9లో అనిల్ ఇనగంటికి సిఈవో లేదా అబ్జర్వింగ్ ఎడిటర్ హోదాతో ప్రవేశం కల్పించారంటే, ఆ సంస్థలో లోకేష్‌కు పాగా వేసినట్లే లెక్క. ఏ ఒప్పందంతో, ఈ నియామకం జరిగిందో ఇంకా బయటకు తెలియడం లేదు. ఇక నుంచి అది తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్‌గా పరిణామం చెందుతుంది. మీడియా రంగంలో ఇది చాలా పెద్ద మార్పు కింద లెక్క. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ ఖాయం. మరో వారం ఆగితేనే కానీ, లోగుట్టు ఏమిటన్నది తెలియదు.
