POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 5:39 am Posted by : POLITICAL POWER

టీ ముచ్చట్లతో పాటు పారిశుధ్యంపై అవగాహన

వ్యాపార సముదాయాలను సందర్శించి పరిశుభ్రతపై సూచనలు చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పారిశుధ్య పరిరక్షణలో వ్యాపారస్తులు, ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని భద్రాచలం రోడ్డు బస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక వ్యాపారస్తులతో టీ తాగుతూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు దుకాణాలను సందర్శించి పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

దుకాణాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై పడవేయకుండా ప్రతి దుకాణం వద్ద డస్ట్‌బిన్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లోనే వ్యర్థాలను వేయాలని కోరారు. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వివరించారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని, మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు సహకరించాలని జూపల్లి రమేష్‌బాబు కోరారు. ‘మన ఊరు – మన శుభ్రత’ అనే నినాదంతో అశ్వారావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నంశెట్టి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ యువజన నాయకుడు జూపల్లి ప్రమోద్, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ రాంబాబు, కానూరి మోహన్‌రావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.