కాంట్రాక్టు విధానం రద్దు చేయాలి.. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి
రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కార్మికుల డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఖమ్మం జిల్లా, నవంబర్ 14 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్, పారిశుద్ధ్య, రోగుల సంరక్షణ, భద్రతా సిబ్బంది, పర్యవేక్షక కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా ఎస్పీఎస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఎస్పీఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 400కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 20 వేల మంది కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 జీవో నంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉండగా, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం రూ.10,500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పలువురు కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, కార్డులు కూడా అందజేయడం లేదని ఆరోపించారు. మహిళా కార్మికుల పట్ల కూడా కొందరు చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఖరారు చేసిన టెండర్ గడువు మూడేళ్లు దాటి మరో ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ప్రతి కార్మికుడిని ఐఎఫ్‌ఎంఐఎస్‌లో విలీనం చేయాలని, నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో లేదా విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగితే కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. కార్మికులకు వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా ఎస్పీఎస్ ప్రచార కార్యదర్శి ప్రశాంత్, కమిటీ సభ్యుడు కోటమర్తి వెంకన్న, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షురాలు ఇనపనూరి కుమారి, ఉపాధ్యక్షురాలు ఎస్.కె. కాసింబీ, సభ్యులు బి. శ్రీనివాసరావు, పి. మరియమ్మ, ఐ. వెంకటరమణ, బి. లక్ష్మి, జె. రాణి, ఈ. రాణి, జె. లక్ష్మి, ఐ. పద్మ, పి. ప్రశాంత్, వై. నాగమణి, షేక్ కాసింబీ, టి. కృష్ణవేణి, పి. సుకన్య, ఎస్. రావి, సి.హెచ్. నాగరాజు, కె. మహేశ్వరరావు, బి. రామతులసి, ఈ. జయమ్మ తదితరులు పాల్గొన్నారు.