POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 4:15 pm Posted by : POLITICAL POWER

తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం

మద్దిగట్లలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు 

అవగాహన కల్పించిన సర్పంచ్ ఎం. రాములు యాదవ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 5 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్ ఎం. రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాములు యాదవ్ మాట్లాడుతూ… తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన ఉత్తమమైన ఆహారమని అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు (కొలస్ట్రామ్) ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. ప్రతి శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సులభంగా జీర్ణమవడంతో పాటు మెదడు ఎదుగుదల, శారీరక వికాసం, రోగనిరోధక శక్తి పెంపునకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అలాగే తల్లులు బిడ్డకు పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లి–శిశు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబం గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాజా, మూడో వార్డు సభ్యురాలు జానకి, ఆశా వర్కర్ కళావతి, ఫీల్డ్ అసిస్టెంట్ బాల బుచ్చన్న, పి. బాలకృష్ణ, యువజన సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, గర్భిణులు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.