POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 10:09 pm Posted by : POLITICAL POWER

తహసీల్దార్‌కు ప్రజా సంఘాల వినతిపత్రం.

వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ,ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలి

కార్మికుల హక్కులకు భంగం కలిగించే చట్టమంటూ విమర్శ

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 01 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని అమలు చేయకుండా రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ పి. సత్యనారాయణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొవ్వారపు లక్ష్మణ్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించడం కార్మికుల హక్కులకు విరుద్ధమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల పోరాటాలు, వామపక్షాల కృషితో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచి కొత్త విధానాన్ని తీసుకురావడం సరైంది కాదన్నారు. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని ప్రచారం చేస్తున్నప్పటికీ, దానికి అవసరమైన నిధుల బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటోందని విమర్శించారు. గతంలో 90 శాతం నిధులను కేంద్రం భరించగా, ఇప్పుడు కేవలం 60 శాతం మాత్రమే ఇస్తామని, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పనుల సీజన్‌లో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే నిబంధన గ్రామీణ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. కొత్త చట్టంలో కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రారంభం మరియు ముగింపు సమయంలో ఫోటోలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేసినప్పుడే వేతనాలు చెల్లించే విధానం అనేక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీలకు పనుల ఎంపికలో అధికారాలు లేకుండా, కేంద్ర ప్రభుత్వమే పనుల కేటాయింపును నిర్ణయించడం స్థానిక స్వయంపాలన వ్యవస్థను బలహీనపరుస్తుందని విమర్శించారు. అలాగే, కొత్త చట్టం అమలైతే మెట్స్, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారకూలీల పని హక్కులను హరించే వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.