POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:58 pm Posted by : POLITICAL POWER

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్ సరైనది కాదు

-పెద్దమందడి మండలం బిఆర్ఎస్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడి శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెన్షన్‌ వేటు వేయడం సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదని పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా గౌరవం, పదవుల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే సభా నిబంధనల అమలులో అధికార, ప్రతిపక్షాలకు వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా, కీలక పదవుల్లో ఉన్న నాయకులు ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో ఇదే విధమైన కఠిన వైఖరిని అవలంబించారా అని కురుమూర్తి ప్రశ్నించారు. అధికార పక్షానికి చెందిన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని రాజకీయ విమర్శలుగా పరిగణిస్తూ, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్సీలు మాట్లాడిన వెంటనే సస్పెన్షన్‌ విధించడం ఏ విధమైన ప్రజాస్వామ్య న్యాయమని నిలదీశారు. సభా నిబంధనలు ఉంటే అవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా సమానంగా వర్తించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పక్షాలకు సమాన న్యాయం, సమాన ప్రమాణాలు ఉండాలని, ఈ విధంగా సస్పెన్షన్‌ వేటు వేయడం సరైన పద్ధతి కాదని పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి పేర్కొన్నారు.