
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కీసర సర్కిల్ : కాప్రా : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కాప్ర మండల డిప్యూటీ తహశీల్దార్ కు జవహర్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కళికోట కమలాకర్ ఆధ్వర్యంలో వినతి..
సెప్టెంబర్ – 17 చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: జవహర్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కళికోట కమలాకర్ డిమాండ్.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఈరోజు జవహార్ నగర్ డివిజన్ బీజేపీ శ్రేణులు తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ జి. ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన, ప్రాధాన్యత కలిగిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జవహర్ నగర్ డివిజన్ బిజెపి కమిటీ ఈ మేరకు డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మహత్తరమైన, చిరస్మరణీయమైన రోజని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన చారిత్రాత్మక సందర్భమని తెలిపారు. ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ప్రజా పోరాటాలు, అనేక మంది వీరుల త్యాగాలు, రైతులు, యువకులు, మహిళలు సామాన్య ప్రజల ఉద్యమాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని వివరించారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరవడం అంటే చరిత్రను విస్మరించినట్లేనని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, అణచివేతలు, ప్రజల పోరాటాలు తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను నేటి యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ విమోచన పోరాటం కేవలం ఒక రాజకీయ అంశం కాదని, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, విముక్తికి సంబంధించిన గొప్ప చారిత్రాత్మక ఉద్యమమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను కేవలం ఒక కార్యక్రమంగా పరిమితం చేయకుండా, తెలంగాణ చరిత్రను గుర్తుచేసుకునే మహత్తరమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, జిల్లా, మండల కేంద్రాల్లో అధికారికంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ విమోచన పోరాట చరిత్రపై ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, యువతలో తెలంగాణ చరిత్రపై పూర్తి అవగాహన కల్పించే లక్ష్యంతో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు చేరవేయాలని చెప్పారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరులను, అమరవీరులను అధికారికంగా స్మరించుకోవడంతో పాటు వారి త్యాగాలను ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడం ద్వారానే తెలంగాణ చరిత్రకు నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి తగిన చారిత్రక గౌరవం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా, అత్యంత ఘనంగా నిర్వహించేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత అని, ఆ మహనీయుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం ద్వారానే వారి త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా SC మోర్చా ప్రధాన కార్యదర్శి మరాఠి బాబు, జిల్లా OBC అధికార ప్రతినిధి బిక్షపతి గౌడ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లిఖిత యాదవ్, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శులు పుల్లూరి అనిల్, బొమ్మ యాదగిరి, కార్యదర్శి ఓరుగంటి లత, మాజీ ఓబీసీ అధ్యక్షులు రాఘవేంద్ర చారి, నాయకులు లక్ష్మీనారాయణ, దయాకర్, సాయి, సత్యం, లక్ష్మణ్ నాయక్, మహిళా నాయకురాళ్ళు ఇంద్రపాల భవాని, రేసోజు భవాని తదితరులు పాల్గొన్నారు.