అర్ధరాత్రి అన్నదాతల పొలాల్లోకి కత్తులతో చొరబాటు
21 ఎకరాల్లో పసిగుడ్డుల్లాంటి కొబ్బరి మొక్కలను నిర్దాక్షిణ్యంగా నరికేసిన దుర్మార్గులు
చేతులతో పీకేయడం కాదు.. కొడవళ్లతో తెగనరికి పైశాచికం!
నల్లకుంట సర్వే నెంబర్ 273/1 అసైన్డ్ భూముల్లో దారుణం
నోటికాడి ముద్ద లాగేసుకున్నారని 7 గురు రైతుల కన్నీటి గోస
పగబట్టి ఏకంగా 21 ఎకరాలను నాశనం చేసిన కబ్జాకోరులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ దమ్మపేట, జులై 6 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భూబకాసురులు రెచ్చిపోయారు. అడ్డుకునేవారు లేరన్న అహంకారంతో.. ఏకంగా 21 ఎకరాల పేద రైతుల పొలాలపై పడి పైశాచికంగా ప్రవర్తించారు. కబ్జాదారుల గుండెల్లో ఎంత కక్ష రగులుతోందంటే.. 21 ఎకరాల్లోని పసి మొక్కలను కేవలం చేతులతో పీకేయలేదు.. కత్తులు, కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికేశారు!. దమ్మపేట మండలం నల్లకుంటలో దారుణం చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 273/1లోని సుమారు 21 ఎకరాల అసైన్డ్ భూములే లక్ష్యంగా బడా నాయకులు, కబ్జాదారులు పంజా విసిరారు., కూలి పనులు చేసుకుంటూ దశాబ్దాలుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్న ఏడుగురు నిరుపేద రైతుల కడుపు కొట్టారు. జూలై 5వ తేదీ అర్ధరాత్రి చీకటి మాటున దొంగల్లా పొలాల్లోకి చొరబడిన దుండగులు.. యెషువ, గ్రేసుమని, కమల, సర్వేశ్వరరావు , గోళ్ళ సీతారావమ్మ తదితర రైతులు 21 ఎకరాల్లో ఎంతో ఆశగా నాటుకున్న కొబ్బరి మొక్కలను కత్తులతో నిర్దాక్షిణ్యంగా నరికేశారు. అరాచకత్వాన్ని ప్రదర్శించారు. ఉదయం పొలానికి వెళ్లి చూసిన రైతులు.. 21 ఎకరాల్లో తెగిపడిన మొక్కల మొదళ్లను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. నిన్నటి దాకా బెదిరింపులకు దిగిన నేతలు.. రాత్రికి రాత్రే ఆయుధాలతో వచ్చి ఇంతటి భారీ స్థాయిలో పంటలను నాశనం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కిరాతకానికి పాల్పడింది కబ్జాదారులే అని, తమకు ప్రాణహాని ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మజి అనిల్, బొట్ట రాజేశ్వరి, ఆంధ్రా ఎమ్మెల్యే బొమ్మజి విజయ్, ఉదతనేనీ మధు తదితర వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి కత్తులతో ఏకంగా 21 ఎకరాల అన్నదాతల ఆస్తుల మీద, ప్రాణాల మీద పడుతున్న ఈ కబ్జాకోరుల ఆటలు పోలీసులు ఎప్పుడు కట్టిస్తారో చూడాలి..