POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:50 pm Posted by : POLITICAL POWER

 దమ్మపేటలో పామాయిల్ గెలల చోరీ.. టన్నుకు పైగా ఎత్తుకెళ్లిన దుండగులు

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 9:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి గ్రామ సమీపంలో పామాయిల్ గెలల చోరీ కలకలం రేపింది. దమ్మపేటకు చెందిన రైతు కంభంపాటి సూరిబాబుకు చెందిన పామాయిల్ తోటలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారు. తోటలోని గెలలను నరికి ఆటోలో టన్నుకు పైగా గెలలను ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో తోటల్లో కాపలా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పామాయిల్ గెలలకు మంచి ధర ఉండటంతో దొంగల కన్ను తోటలపై పడింది. టన్ను గెలల ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. దీంతో రాత్రికి రాత్రే గెలలు నరికి అక్రమంగా ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నా.. రైతులకు రక్షణ మాత్రం కరువైంది. చాలా తోటలు ఊరికి దూరంగా ఉండటం, కాపలాకు మనుషులు లేకపోవడంతో దొంగలకు ఇది వరంగా మారింది. గతంలోనూ ఇదే తరహాలో పలు చోట్ల గెలల చోరీలు జరిగాయి. కంపెనీలు గెలలు తీసుకొచ్చిన వారి వివరాలు సరిగా పరిశీలించకపోవడం కూడా చోరీలకు కారణమవుతోందని రైతులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు, ఉద్యానవన శాఖ అధికారులు దృష్టి సారించి నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు.