POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 5:57 pm Posted by : POLITICAL POWER

దమ్మపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘వంటా-వార్పు’ నిరసన

 

ప్రజలను వంచించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ప్రజా వ్యతిరేక సర్కారు

రైతులు, వృద్ధులు, మహిళలను నిలువునా ముంచారు

మాజీ ఎమ్మెల్యే,పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు,నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్‌ఛార్జి ఉప్పల వెంకటరమణ పొలిటికల్ పవర్, దమ్మపేట సెప్టెంబర్ 4: గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  మరియు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ విఫల పాలనకు నిరసనగా  దమ్మపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మండల పార్టీ మాజీ అధ్యక్షులు దొడ్డ రమేశ్‌  ఆధ్వర్యంలో ‘వంట-వార్పు’నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపైనే పొయ్యిలు పెట్టి వంటలు చేస్తూ ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం విప్పారు.సంక్షేమాన్ని గాలికొదిలేశారు: మెచ్చా నాగేశ్వరరావు

కేసీఆర్‌ హయాంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలను విజయవంతంగా అందించారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గిరిజనుల దశాబ్దాల కల అయిన పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వెళ్లిన మన నియోజకవర్గానికి చెందిన అమ్మాయి పరిస్థితే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటను సొంత పార్టీ నేతలే వినే పరిస్థితి లేదని,వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చని.వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

హామీలన్నీ మోసపూరితమే: ఉప్పల వెంకటరమణ

వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని ఉప్పల వెంకటరమణ మండిపడ్డారు. వృద్ధులకు రూ.4,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట వృద్ధాశ్రమానికి చెందిన కోటేశ్వరరావుతో ఆయన మాట్లాడి, పెన్షన్ రాకపోవడంపై ఆవేదనను తెలుసుకున్నారు. ఒక్కో వృద్ధుడికి రూ.82,500, దివ్యాంగులకు రూ.66,000 చొప్పున ప్రభుత్వం బాకీ పడిందని లెక్కలతో సహా వివరించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, చివరకు కేసీఆర్ ఇచ్చిన పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
రైతుబంధు కింద రైతులకు రూ.2,936 కోట్ల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం దగా చేసిందన్నారు. నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేశారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కమీషన్ల సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. 1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా భూ వ్యవహారాలు సాగుతున్నాయని, పామాయిల్ ఫ్యాక్టరీల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పామాయిల్ రిఫైనరీ పరిశ్రమను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈ ఉద్యమ బాట పట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు,మండల మాజీ అధ్యక్షులు, మండల నాయకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.