రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండాలి..
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: తహసీల్దార్
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 22: దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు ఎలాంటి అవకాశం లేదని, రైతులు, భూ హక్కుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), దమ్మపేట తహసీల్దార్ మద్దినేని మురళి సూచించారు.
రెవెన్యూ కార్యాలయంలో దళారుల కార్యకలాపాలు తిరిగి కొనసాగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. భూ వ్యవహారాలకు సంబంధించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ప్రస్తుత తహసీల్దార్ పదవి కొంతకాలమే ఉంటుందని, అనంతరం తమకు అనుకూలమైన అధికారి వస్తారని రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు.
పట్టా, పాస్‌బుక్ పేరుతో మోసాలకు పాల్పడితే ఫిర్యాదుచేయండి
భూ బదిలీలు, పట్టా పుస్తకాలు, పాస్‌బుక్కులు తదితర భూ వ్యవహారాలను పూర్తిగా చట్టబద్ధంగా, రెవెన్యూ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించుకోవాలని తహసీల్దార్ సూచించారు.
ఎవరైనా దళారులు భూ సమస్యలను పరిష్కరిస్తామని, పట్టా పుస్తకాలు లేదా పాస్‌బుక్కులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినా, ప్రలోభాలకు గురిచేసినా వారి మాటలు నమ్మవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులపై వెంటనే దమ్మపేట తహసీల్దార్ కార్యాలయానికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
దళారులపై నిఘా
ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని మద్దినేని మురళి పేర్కొన్నారు. దళారుల కార్యకలాపాలపై ఇప్పటికే నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు, భూ హక్కుదారులు తమ భూ వ్యవహారాల్లో మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
“దళారీ వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. భూ వ్యవహారాల్లో చట్టబద్ధమైన విధానాలనే అనుసరించండి” అని తహసీల్దార్ మద్దినేని మురళి విజ్ఞప్తి చేశారు.