పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 26 2026: దేశంలో ప్రతి పౌరుడికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆలస్యం విరన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విద్య, వైద్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులని, వాటిని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధికి విద్య, ఆరోగ్య రంగాలే పునాదులని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు వంటి కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వైద్య రంగంపై మాట్లాడుతూ… ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స ఖర్చులు సామాన్య ప్రజలకు భారంగా మారాయని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసి, మందులు, వైద్య పరీక్షలు, చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించాలని కోరారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ పలు డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. విద్యారంగానికి జీడీపీలో 6 శాతం బడ్జెట్ కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించడం, డాక్టర్లు, ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన నియంత్రణ అమలు చేయడం వంటి అంశాలను డిమాండ్ చేసింది. విద్య, వైద్యం ప్రతి పౌరుడి హక్కులని, వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వాల బాధ్యత అని ఆలస్యం విరన్ పేర్కొన్నారు. “పేదవాడి బిడ్డ కూడా డాక్టర్ కావాలి, ఆసుపత్రి బిల్లుల భయంతో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. విద్య, వైద్యం హక్కు… దానం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా “ఉచిత విద్య – ఉచిత వైద్యం” అమలుకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.