POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 7:34 pm Posted by : POLITICAL POWER

ధ్వంసమైన రోడ్లను తక్షణమే బాగు చేయాలి

జిల్లాలో అధ్వానంగా మారిన ఆర్ అండ్ బి రహదారులు

గుంతల మయంగా మారిన వనపర్తి పెబ్బేరు బీటీ రోడ్డు

నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు

ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు కనిపించడం లేదా?

— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 07 2026: జిల్లాలో ధ్వంసమైన ఆర్ అండ్ బి రోడ్లను తక్షణమే బాగు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం వనపర్తి-పెబ్బేరు రోడ్డును బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో దాదాపు 600 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రహదారులు ఉన్నాయని, అందులో 200 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతల మయంగా ఉందన్నారు. వనపర్తి నుంచి పెబ్బేరు వరకు 20 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డులో తొమ్మిది కిలోమీటర్లకు పైగా అధ్వానంగా మారి ప్రయాణికులకు నరకయాతన కలిగిస్తుందని తెలిపారు. ప్రతినిత్యం అభివృద్ధి పేరుతో జపం చేస్తున్న జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వనపర్తి-పెబ్బేరు రోడ్డు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అనారోగ్య సమస్యలతో పెబ్బేరు నుంచి వనపర్తికి వచ్చే ప్రయాణికులు గతుకుల, గుంతల మయంగా మారిన రోడ్డు వల్ల మార్గమధ్యలోనే అనంత లోకాలకు వెళ్లే విధంగా రహదారి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆర్ అండ్ బి అధికారులను సంప్రదించగా రోడ్డు మరమ్మత్తులకు శాంక్షన్ కాలేదని బదులివ్వడం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లుగా ఇటీవలే ప్రజా ప్రతినిధులు వెల్లడించినట్లు ఆయన గుర్తు చేశారు. మరి వనపర్తి-పెబ్బేరు బీటి రోడ్డు అభివృద్ధిలో భాగం కాదా? అని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పెబ్బేరు వనపర్తి రోడ్డుతో పాటు జిల్లాలో ద్వంసమైన ఆర్ అండ్ బి రోడ్లను బాగు చేయాలని, లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జెఎసి వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, చెలిమిళ్ళ రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.