POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 8:37 pm Posted by : POLITICAL POWER

నరకానికి చిరునామా ‘చెన్నమ్మ సర్కిల్’: హైవే పై నిత్యం ట్రాఫిక్ నరకం.. ప్రాణాలు పోతున్నా నిద్రమత్తులో యంత్రాంగం!

పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక) కర్నూలు జిల్లా | కల్లూరు ఎస్టేట్ ప్రత్యేక కథనం రిపోర్టర్: దస్తగిరి. పి (కర్నూలు) తేదీ: 05 నవంబర్ 2026

  • బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్
  • నాలుగు రోడ్ల కూడలి వద్ద నిత్య ప్రమాదాలు.. రక్తమోడుతున్న ద్విచక్ర వాహనదారులు
  • ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టకపోవడంపై ప్రజల తీవ్ర ఆగ్రహం
  • ప్రభుత్వ నిర్లక్ష్యంపై పొలిటికల్ పవర్  స్పెషల్ ఫోకస్!

కల్లూరు ఎస్టేట్ (పొలిటికల్ పవర్  విభాగం): ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా? నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నా అధికారుల కళ్లల్లో చలనం రాదా? బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ చెన్నమ్మ సర్కిల్ హైవే బ్రిడ్జి వద్ద నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యిందంటే చాలు.. వాహనదారులు, పాదాచారులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం.

సుదూర ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారి, దానికి తోడు స్థానిక పట్టణ పరిధిలోని నాలుగు రోడ్ల కూడలి కావడంతో చెన్నమ్మ సర్కిల్ వద్ద వాహనాల రద్దీ అంబరాన్ని తాకుతోంది. ట్రాఫిక్ తీవ్రతకు తగ్గట్టుగా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకపోవడమే ఈ సమస్త అనర్థాలకు మూలకారణంగా మారింది.

రక్తమోడుతున్న రహదారి.. బలైపోతున్న అమాయకులు!

ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం, వాహనాల కదలికలను క్రమబద్ధీకరించే యంత్రాంగం లోపించడంతో రోజులు గడుస్తున్నకొద్దీ ప్రమాదాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భారీ వాహనాల మధ్య చిక్కుకుని తీవ్ర గాయాలపాలవుతున్నారు. పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇన్ని జరుగుతున్నా.. ఇటు జిల్లా యంత్రాంగం గానీ, అటు హైవే నిర్వాహకులు గానీ స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డుపై రక్తం చిందినా, అమాయకులు బలైపోతున్నా.. ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రత్యామ్నాయం ఏది? ఫ్లైఓవర్ ఎప్పుడు?

ఈ నాలుగు రోడ్ల కూడలి వద్ద పెరిగిన రద్దీకి అనుగుణంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి (Flyover Bridge) నిర్మించడమే ఏకైక పరిష్కారమని స్పష్టమవుతున్నా.. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

పొలిటికల్ పవర్ డిమాండ్: ఇప్పటికైనా ప్రభుత్వం, నేషనల్ హైవే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిద్రమత్తు వీడాలి! వెంటనే ఈ సమస్యపై సమీక్ష నిర్వహించి, కల్లూరు ఎస్టేట్ చెన్నమ్మ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి. నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు, ట్రాఫిక్ జాం‌కు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల ప్రాణాలను కాపాడాలని పొలిటికల్ పవర్ పత్రిక సవాలు చేస్తూ డిమాండ్ చేస్తోంది!

– దస్తగిరి. పి, కర్నూలు జిల్లా రిపోర్టర్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక.