POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:00 am Posted by : POLITICAL POWER

నర్సరీ, వైకుంఠధామం సమీపంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

వెంటనే కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: ఖిల్లా ఘనపూర్ మండలం, ఆగారం: ఖిల్లా ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో గ్రామ నర్సరీ మరియు వైకుంఠధామం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతిరోజూ నర్సరీలో పని చేసే కార్మికులు, గ్రామస్థులు, అలాగే మూగజీవులు సంచరిస్తుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎలాంటి రక్షణ కంచె లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నా గ్రామపంచాయతీ అధికారులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.