జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్షించిన కమిషనర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్&ఆర్, ఇర్రిగేషన్ భూసేకరణ కమీషనర్ కె. శివకుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై ప్రాజెక్టుల వారిగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో ఉన్న పెండింగ్ అంశాలను వేగవంతంగా పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. సమీక్ష సందర్భంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మున్నేరు–పాలేరు లింక్ కాలువతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కోర్టు కేసులు మరియు సర్వే పనుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవార్డుల జారీ, చెల్లింపుల ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమీషనర్ తెలిపారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షించాలని కమిషనర్ అన్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లాలో పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. జవహర్ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి 11 గ్రామాల్లో 193.15 ఎకరాల భూసేకరణ అవార్డ్ దశలో ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు కు సంబంధించి 14వ ప్యాకేజి క్రింద 650.22 ఎకరాల భూ సేకరణ లో 623.02 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసినట్లు కలెక్టర్ అన్నారు. 15వ ప్యాకేజీకి సంబంధించి 198.13 ఎకరాల భూసేకరణ కు గాను అవార్డ్ పాస్ చేసి, భూనిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు. ప్యాకేజి16 కు సంబంధించి 820.12 ఎకరాలకు గాను అవార్డ్ పాస్ చేసినట్లు, 796.13 ఎకరాలకు పరిహారం చెల్లింపులు పూర్తి చేసి స్వాధీనం చేసుకున్నట్లు, మిగతా భూమికి పరిహారం ప్రభుత్వం నుండి రావాల్సి ఉన్నట్లు తెలిపారు. ప్యాకేజి 6, 2, 1 లకు సంబంధించి భూసేకరణ పురోగతిలో ఉందన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇర్రిగేషన్ సిఈ లు ఎం. వెంకటేశ్వర్లు, శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎస్డీసి సదానందం, ఇర్రిగేషన్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.