POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 5:14 pm Posted by : POLITICAL POWER

నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు

ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ–2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా పేపర్ లీక్ ఆరోపణలు రావడం దేశ విద్యా వ్యవస్థపై అనుమానాలు పెంచుతోందన్నారు. పరీక్షకు 48 గంటల ముందే 122 ప్రశ్నలు బయటకు వచ్చాయనే ఆరోపణలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయని తెలిపారు.

ప్రశ్నాపత్రాల భద్రతను కాపాడాల్సిన జాతీయ పరీక్షల సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, పేపర్ లీక్ ఘటనలు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు.

పరీక్షల రద్దులు, పునఃపరీక్షల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల నుంచి ప్రవేశ పరీక్షల వరకు పేపర్ లీకులు పెరుగుతున్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయని డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి తెలిపారు.