
కలసపాడు, నవంబర్ 14 (పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ – సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక):
ఎం. ప్రసాదరావు, వైఎస్ఆర్ కడప జిల్లా రిపోర్టర్, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ.
బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల కేంద్రంలోని స్థానిక సెయింట్ ఆంటోనిస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ చిత్తా బాల్ రెడ్డి, జయమ్మ, మరియు కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా భారతదేశ మొదటి ప్రధాన మంత్రి, జాతి నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “నేటి బాలలే రేపటి పౌరులు” అన్న చాచా నెహ్రూ ఆశయాలను విద్యార్థులకు మరోసారి గుర్తుచేశారు. పిల్లలంటే నెహ్రూకు ఉన్నఅపారమైన ప్రేమను కొనియాడుతూ, ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి, కష్టపడి ప్రయోజకులు కావాలనే సమున్నత లక్ష్యంతోనే నెహ్రూ అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్‌ను ఏర్పాటు చేసి విద్యారంగానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
అనంతరం మదర్ టెరిసా గారి అడుగుజాడలను స్మరిస్తూ.. “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది” అనే గొప్ప సూక్తిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పాల్గొని, తమలోని సృజనాత్మకతను వెలికితీసి భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా ప్రభావతి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.