మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
చెంగిచెర్లలో చార్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల డివిజన్ ఆర్టీసీ కాలనీలో చార్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని పర్యావరణ అనుకూల మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సమాజం మనకేమిస్తుందని చూడకుండా సమాజం కోసం తన వంతు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా మతిస్థిమితం సరిగా లేని పిల్లలని చార్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణతో పాటు విద్య వైద్యాన్ని అందిస్తున్న మహేందర్ రెడ్డిని అభినందిస్తున్నానని, వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పర్యావరణహిత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి చార్విక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేఖల మహేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు బండారు పవన్ రెడ్డితో కలిసి హాజరై మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.