పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలి
దోమల నివారణపై దృష్టి ఏదీ?
నిధులు విడుదల చేయాలని ప్రజల డిమాండ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట: మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగు కాలువలు నిండిపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, దోమలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, దోమల నివారణ మందు పిచికారీ చేయడం, మురుగు కాలువల శుభ్రత, చెత్త తొలగింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. రోడ్లపై ఆవులు, గేదెలను కట్టివేయడం, ఇష్టానుసారంగా చెత్త వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైతే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.