ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు
పొలిటికల్ పవర్,దమ్మపేట సెప్టెంబర్ 12: పామాయిల్ గెలల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పామాయిల్ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాలకు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులు, పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ హాజరయ్యారు. రైతుల పంటకు భద్రత కల్పించడంతో పాటు గెలల దొంగతనాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు.
F-Code దుర్వినియోగంపై అప్రమత్తత
ప్రతి రైతు F-Codeకు తగిన పరిమితి విధించి, దాని దుర్వినియోగానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ F-Code వివరాలను ఇతరులకు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
పామాయిల్ గెలల రవాణా జరిగే ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రైతులు తమ తోటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.
అనుమానాస్పద రవాణాపై వెంటనే పోలీసులకు సమాచారం
పామాయిల్ గెలలను ఫ్యాక్టరీలకు తరలించేందుకు నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా పామాయిల్ గెలల లోడింగ్ లేదా అన్‌లోడింగ్ జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పామాయిల్ గెలల దొంగతనాలను అరికట్టేందుకు రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు, డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై రాజేష్ కుమార్ సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో TG Oilfed తరఫున నాగబాబు, వెంకటేష్, శంకర్, కార్తీక్‌తో పాటు పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.