POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:57 pm Posted by : POLITICAL POWER

పామిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా గ్రామసభ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామంలోని పాడుబడ్డ ఇళ్ల నుంచి పక్క ఇళ్లలోకి విషపురుగులు వస్తున్నాయని గ్రామ ప్రజలు పంచాయతీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, పాడుబడ్డ ఇళ్లను గుర్తించి త్వరితగతిన తగిన చర్యలు చేపడతామని సర్పంచ్ ప్రజలకు వివరించారు. ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సహకారంతో పార్టీలకు అతీతంగా అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. అదేవిధంగా గ్రామంలోని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ కోరారు. ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు, వార్డు సభ్యులు శంకర్, కృష్ణ, నరేష్, లక్ష్మి, పద్మ, యాదమ్మ, యాదయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, అటవీ శాఖ, ఇరిగేషన్, ఉపాధి హామీ, రెవెన్యూ శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.