లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ కొమరం సుశీల
పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 14: అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించి, ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత సామాజిక భద్రత పెన్షన్లు పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీకి మొత్తం 25 నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమరం సుశీల ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక భరోసాను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
నూతనంగా మంజూరైన 25 పెన్షన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.,
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ కొమరం సుశీల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.