పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జూన్ 26 2026: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ శ్రీమతి హన్మమ్మకు నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన పీఎఫ్ బకాయిలు, రెండు నెలల జీతం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర ఎస్‌పీఎస్ యం & హెచ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కుర్రి సైదయ్య తెలిపారు. ఈ ఘటన కేవలం ఒక ఉద్యోగినికి జరిగిన అన్యాయం మాత్రమే కాదని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 17,800 మంది శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి ఈపీఎఫ్ పేరుతో కోతలు విధిస్తున్నప్పటికీ, ఆ మొత్తాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకపోవడం అత్యంత తీవ్రమైన విషయమని, ఇది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. పేద మహిళ తన హక్కుగా రావాల్సిన పీఎఫ్ నిధుల కోసం నాలుగు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగి, చివరకు మనోవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరమన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నేడు తమ చట్టబద్ధమైన హక్కుల కోసం వేడుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసి, సంబంధిత ఏజెన్సీతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల బాధ్యతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పీఎఫ్ నిధులను సకాలంలో జమ చేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ కమిటీ ప్రధాన డిమాండ్లు: 1. హన్మమ్మకు పూర్తి స్థాయి ఉచిత వైద్యం అందించి ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించాలి. 2. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 3. సంబంధిత ఏజెన్సీ, బాధ్యుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 4. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ, వేతన బకాయిలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి పెండింగ్ మొత్తాలను చెల్లించాలి. 5. ప్రతి నెలా పీఎఫ్ జమ వివరాలను ఉద్యోగులకు అందుబాటులో ఉంచే పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 6. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ సంఘటనను సాధారణ ఘటనగా తీసుకోకుండా వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల హక్కులు పరిరక్షించబడే వరకు పోరాటం కొనసాగుతుందని ఎస్‌పీఎస్ యం & హెచ్ వర్కర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. జై తెలంగాణ – జై ఎస్‌పీఎస్ ఉద్యోగుల ఐక్యత.