
![]()
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రికతూర్పుగోదావరిజిల్లా అనపర్తి, మే 18:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యులపై భారం మోపుతోందని ఆరోపిస్తూ, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనపర్తిలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నాయకత్వం వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డుమీదుగా దేవి చౌక్ సెంటర్ దాటి పాత ఊర్లోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.
దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైయస్‌ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
