లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?!! నెలకు అసలు లాభం ఎంత?!!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటినప్పుడల్లా చాలామంది మనస్సులో ఒకే ఆలోచన వస్తుంది. రూ.100 పెట్రోల్ పోస్తే అందులో పెట్రోల్ 1పంప్ యజమాని ఎంత సంపాదిస్తాడు..?? అసలు లీటరుకు భారీ లాభాలు వస్తాయా? అని అనుకుంటారు. చాలామంది పెట్రోల్ పంప్ యజమానులకు లీటరుపై రూ.5 నుండి రూ.10 వరకు లాభం వస్తుందేమో అని భావిస్తారు. కానీ అసలు నిజం వేరుగా ఉంది. అయితే పెట్రోల్ మార్కెటింగ్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
రూ.100 పెట్రోల్‌పై కమిషన్ లెక్కలు ఎలా ఉంటాయి?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ పంప్ యజమానులకు (డీలర్లకు) ప్రతి లీటరు అమ్మకంపై నిర్ణీత కమిషన్ అందిస్తాయి. పెట్రోల్‌పై డీలర్‌కు లీటరుకు సుమారు రూ.3.14 నుండి రూ.3.50 వరకు కమిషన్ లభిస్తుంది. ఇందులో స్థిరమైన కమిషన్ తో పాటు ప్రాడక్ట్ బిల్లు ధర ఆధారంగా వచ్చే చిన్న శాతం (0.870%) కమిషన్ కూడా కలుస్తుంది. అలాగే డీజిల్ అమ్మకాలపై డీలర్లకు లీటరుకు సుమారు రూ.2.33 నుండి రూ.2.50 వరకు కమిషన్ అందుతుంది. అయితే కమిషన్ లో మార్పులు కూడా ఉండవచ్చు…
కమిషన్ మొత్తం యజమాని నికర లాభమా?!
కాదు.. యజమానికి వచ్చే కమిషన్ వేరు, నికరలాభం వేరు. ఒక పెట్రోల్ పంప్‌ను రోజూ నడపాలంటే భారీగా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. యజమాని తన కమిషన్ నుండి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు ఉంటాయి. అవేంటో చూద్దాం.. పనిచేసే ఉద్యోగుల (సిబ్బంది) నెలవారీ జీతాలు. భారీ విద్యుత్ బిల్లులు, డిజిటల్ చెల్లింపుల ఛార్జీలు.
పంప్ యంత్రాల నిర్వహణ, ఆయిల్ సర్వీసింగ్ ఖర్చులు.
పంప్ భూమి అద్దె, భద్రత, పరిశుభ్రత ఖర్చులు. పెట్రోల్ ఆవిరి కావడం వల్ల జరిగే చిన్నపాటి నష్టం ఈ అన్ని ఖర్చులనూ మినహాయించిన తర్వాత యజమానికి రూ.100 లీటర్ పెట్రోల్‌పై మిగిలే నికర లాభం కేవలం రూ.1.00 నుండి రూ.1.50 మాత్రమే.
పెట్రోల్ పంప్ యజమానులు అసలు సంపాదన ఎలా?
పెట్రోల్ పంప్ అనేది “తక్కువ మార్జిన్ – ఎక్కువ విక్రయాలు” ఆధారంగా పనిచేసే వ్యాపారం. ఒక లీటరుపై తక్కువ లాభం వచ్చినా, రోజువారీ విక్రయాల పరిమాణం ఆధారంగా యజమాని సంపాదన ఆధారపడి ఉంటుంది. ఒక పెట్రోల్ పంప్‌లో రోజుకు 5,000 లీటర్ల పెట్రోల్ అమ్ముడైతే, డీలర్‌కు వచ్చే మొత్తం కమిషన్ సుమారు రూ.15,700 వరకు ఉంటుంది. నెల మొత్తానికి ఇది దాదాపు రూ.4.70 లక్షల వరకు కమిషన్‌గా మారుతుంది. ఇందులో జీతాలు, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చుల రూపంలో రూ.2 లక్షల నుండి రూ.2.5 లక్షలు పోయినా, యజమానికి నెలకు రూ.2 లక్షలకు పైగా నికర లాభం దక్కుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే రోజుకు ఎక్కువ లీటర్ల ఇంధనం అమ్ముడయ్యే హైవేలు లేదా బిజీ సెంటర్లలో ఉండే పంప్ యజమానులు మాత్రమే మంచి లాభాలను పొందగలుగుతారు.