విద్యార్థుల శాస్త్రీయ, డిజిటల్ నైపుణ్యాల పెంపుపై అధికారుల దిశానిర్దేశం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 6 2026: పెద్దమందడి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం గురువారం మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లో మండల విద్యాధికారి మంజులత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా సీఎంఓ ప్రతాప్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు హాజరై పాఠశాలల్లో అమలు చేయాల్సిన పలు విద్యా, శాస్త్రీయ, సాంకేతిక కార్యక్రమాలపై ప్రధానోపాధ్యాయులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రేరణ (ఇన్‌స్పైర్) నామినేషన్లు, జాతీయ బాలల శాస్త్ర సదస్సు (ఎన్‌సీఎస్‌సీ) నమోదు, “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమం, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ అభ్యాసం, డిజిటల్ అభ్యాసంపై పుస్తకం, ఏఎక్స్‌ఎల్ కార్యక్రమం, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, పాఠశాల సైన్స్ ప్రయోగశాలల బలోపేతం, ఫిజిక్స్ వాలా విద్యా వేదిక వినియోగం, అన్న–అక్క కార్యక్రమం, ప్రశస్త్ యాప్, ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమం, వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్–వీఆర్) ఆధారిత బోధన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆయా కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, ప్రతి విద్యార్థికి వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దమందడి మండల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఎస్. వరప్రసాద్ రావు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ విష్ణు, సీఆర్పీలు తిరుపతయ్య, సేవ్యతో పాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.