పనులు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పాదయాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
–కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి మరమ్మతు పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న రోడ్డు పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ… ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి అభివృద్ధికి సుమారు రూ.40 కోట్లతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనులు ప్రారంభమై కొనసాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు వాటికి సహకరించాల్సిందిపోయి రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు.పెద్దమందడి, ఖిల్లాఘనపూర్ మండలాల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ… పెద్దమందడి–వనపర్తి రహదారి పనులు ప్రారంభం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రూ.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న రహదారి పనులు పూర్తయితే నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, రైతులు, వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు పనులు కొంతమేర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రస్తుతం సమస్యలను అధిగమించి పనులు ప్రారంభమైనందున ఎలాంటి ఆటంకాలు లేకుండా రహదారి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ మాట్లాడుతూ… పెద్దమందడి–వనపర్తి రహదారి ప్రజలకు ఎంతో కీలకమైనదని, ఈ మార్గంలో ప్రతిరోజూ అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం రూ.40 కోట్లతో చేపడుతున్న రహదారి పనులు పూర్తయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.ప్రస్తుతం రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేయడం కంటే పనులు సక్రమంగా పూర్తయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. రహదారి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.