POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 1:39 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి–వనపర్తి రోడ్డుపై ప్రభుత్వానికి ప్రజల గట్టి ప్రశ్న!

రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రజావాణిలో బిఆర్ఎస్ నేతల వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పెద్దమందడి మండలం నుంచి జిల్లా కేంద్రమైన వనపర్తి వరకు రోడ్డు మార్గాన్ని సక్రమంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ పెద్దమందడి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. మండల ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారి విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరారు. పెద్దమందడి మండలం నుంచి వనపర్తికి ప్రతిరోజూ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, కూలీలు, సామాన్య ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పెద్దమందడి నుంచి వనపర్తి వరకు సరైన రోడ్డు మార్గం సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ప్రజలకు సమయం, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ వనపర్తికి రాకపోకలు సాగించాల్సి ఉండటంతో రోడ్డు సౌకర్యం అత్యవసరంగా అవసరమని తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పెద్దమందడి–వనపర్తి రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తే మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు వనపర్తితో రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని పెద్దమందడి నుంచి వనపర్తి వరకు రోడ్డు మార్గాన్ని ప్రారంభించడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రజలతో కలిసి మరింతగా పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు కీలకమైన పెద్దమందడి–వనపర్తి రోడ్డు సమస్యను ప్రభుత్వం ఇకనైనా ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజావాణి అధికారులకు విజ్ఞప్తి చేశారు.