
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్
ప్రజా గుండెల్లో నిలిచిన ‘పెద్దన్న’… స్మరణలో కొత్త అధ్యాయం!
ప్రజా క్షేత్రంలోకి పెద్ది సతీమణి స్వప్న అడుగులు
మరణం కూడా ఒక నాయకుడి వైభవాన్ని తగ్గించలేదు, సరికాదా.. ఆయన నిష్క్రమణ వేళ సాగిన చివరి ప్రయాణం నర్సంపేట పొలిటికల్ స్క్రీన్‌పై రణన్నినాదం మోగించింది. బ్రతికినంత కాలం ప్రజల కోసం, తెలంగాణ మలి దశ ఉద్యమం, బి.ఆర్.ఎస్ పార్టీ కోసం పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డికి జన నీరాజనంతో ప్రజలు ఋణం తీర్చుకున్నారు. నర్సంపేటలో పెద్ది అంతిమ యాత్రతో నర్సంపేటనియోజకవర్గ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ హవా నడుస్తున్న వేళ, అపారమైన జనప్రవాహం వరంగల్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల నుండి నర్సంపేట, నల్లబెల్లి వీధుల వరకు రాజకీయాలకు అతీతంగా జన సముద్రంలా తరలిరావడం కేవలం ఒక నాయకుడికి ఇచ్చిన నివాళి మాత్రమే కాదు.. అది ఉద్యమ స్ఫూర్తికి, ప్రజలతో ఆయన పెంచుకున్న పేగుబంధానికి నీరాజనం!
ఉద్యమ నేపథ్యం & సమగ్ర చరిష్మా: ‘పెద్ది స్వప్న’
సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేసేందుకు, ఆయన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సతీమణి పెద్ది స్వప్న ముందడుగు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆమె కేవలం ఒక నాయకుడి భార్య మాత్రమే కాదు… తెలంగాణ మలి దశ ఉద్యమ కాలంలోనే చురుగ్గా పని చేసి, సొంతంగా భావజాలం, ప్రజా సమస్యలపై పట్టు ఉన్న అధ్యయనశీలి. ఒక వైపు ఉన్నత విద్యార్హత కలిగిన యువతిగా, మరోవైపు సామాజిక విప్లవాత్మక అడుగుతో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆదర్శ వివాహం చేసుకున్న నేపథ్యం ఆమె సొంతం.
బిఆర్ఎస్ (BRS) వ్యూహం… బిగ్ గేమ్‌చేంజర్?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో రెండేళ్లలో సమీపిస్తున్నప్పటికీ నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థిగా పెద్ది స్వప్న బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం ముమ్మరమైంది. బి.ఆర్.ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపేందుకు అనేక రాజకీయ అనుకూలతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మహిళా బిల్లు అమలు లేదా పార్టీల మహిళా ప్రాతినిధ్యంలో భాగంగా నర్సంపేట స్థానాన్ని స్వప్నకి కేటాయించడం సులభమవుతుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా రిజర్వేషన్ల మార్పులు (జనరల్ లేదా ఎస్సీ రిజర్వ్‌డ్) ఎలా జరిగినా, తనకున్న సామాజిక, కుటుంబ నేపథ్యంతో ఆమె నర్సంపేట స్థానం నుండి పోటీకి నిలబడగలిగే ప్రత్యేకమైన వెసులుబాటు కలిగి ఉన్నారు.
ప్రజా సానుభూతి & చరిష్మా
సుదర్శన్ రెడ్డిపై ఉన్న ఇక్కడ ప్రజాభిమానం, అమరుల కుటుంబాలకు ఆయన అందించిన భరోసా, స్వప్న వ్యక్తిగత చరిష్మా, రాజకీయ చతురత కలిసి బి.ఆర్.ఎస్ పార్టీకి నర్సంపేటలో తిరుగులేని బలాన్ని అందిస్తాయని కేడర్ ధీమాగా ఉంది. ఏది ఏమైనా నర్సంపేట గడ్డపై మారిన ఈ రాజకీయ వాతావరణం, జనసముద్రంగా మారిన అంతిమ యాత్ర నియోజకవర్గంలో కొత్త చైతన్యాన్ని రగిలించింది. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాల బాటలో, పెద్ది స్వప్న నాయకత్వంలో నర్సంపేట రాజకీయం రాబోయే రోజుల్లో కొత్త మలుపులు తిరగడం ఖాయం!