POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 11:59 am Posted by : POLITICAL POWER

పేదలకు ఉచిత కంటి వైద్యం అందించడం అభినందనీయం:మెచ్చా

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట,అక్టోబర్ 21: పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్య హాస్పిటల్‌లో లయన్ వైరా కంటి ఆసుపత్రి సౌజన్యంతో, లయన్స్‌ క్లబ్‌ అశ్వారావుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్న వారిని మెచ్చా నాగేశ్వరరావు ఆప్యాయంగా పలకరించి, పండ్లు పంపిణీ చేశారు. శిబిరంలో అందుతున్న వైద్య సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సేవాభావంతో ముందుకు వచ్చిన లయన్స్‌ క్లబ్‌ సభ్యులను, లయన్ వైరా కంటి ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు, అవసరమైన సలహాలు అందించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడవచ్చని అన్నారు. ప్రజారోగ్యంపై బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న సంస్థలు, వైద్యులు అభినందనీయులని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, యూఎస్‌ ప్రకాశ్‌రావు, సంక ప్రసాద్‌, లింగంకుంట కృష్ణ, కలపాల బాబురావు, వేముల ప్రసాద్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.