ప్రజల కష్టాలు తెలుసుకుని.. పరిష్కారం కోసం అధికారుల వద్దకు ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట,పొలిటికల్ పవర్, ఆగస్టు 27: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం స్వయంగా అధికారులను కలిసి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం కోరుతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితుల నుంచి సేకరించిన 78 ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి అందజేశారు.
ఖరీదైన వైద్య చికిత్సలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అండగా నిలవాలనే ఉద్దేశంతో అర్హులైన బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం స్థానిక స్థాయిలో పరిష్కరించడానికే పరిమితం కాకుండా, అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను స్వయంగా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జారె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తనవంతు బాధ్యతగా పనిచేస్తున్నట్లు తెలిపారు.