POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:01 pm Posted by : POLITICAL POWER

పోరుమామిళ్ల 14వ వార్డులో సిమెంట్‌ రోడ్డు వెంటనే నిర్మించాలి: సీపీఎం

ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించిన సీపీఎం నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / PN9 టీవీ తెలుగు న్యూస్, వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో: వెంకటేష్ ఆగస్టు 13 2026: పోరుమామిళ్ల పట్టణంలోని 14వ వార్డులో గత 20 ఏళ్లుగా సిమెంట్‌ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సిమెంట్‌ రోడ్డు నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు 14వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో గుంతలు, మెట్టల కారణంగా వృద్ధులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు ప్రమాదాలకు గురై ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి ఎన్. భైరవప్రసాద్, సీఐటీయూ మండల అధ్యక్షులు సోమయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌసియాభేగం మాట్లాడుతూ… 14వ వార్డు ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, వార్డు అభివృద్ధిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. పట్టణంలోని ఇతర వీధుల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్‌ రోడ్లు నిర్మించినప్పటికీ, 14వ వార్డుకు మాత్రం రోడ్డు నిర్మించకపోవడం అన్యాయమని అన్నారు. సంబంధిత పంచాయతీ ఈఓ, ఎంపీడీఓలు 14వ వార్డును వెంటనే సందర్శించి పరిస్థితిని పరిశీలించి, అవసరమైన నిధులు మంజూరు చేసి సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే 14వ వార్డు ప్రజలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు ప్రజలు నాయిబ్, మున్ని, అంజలి, అమ్మని, పెద్ద కాదరమ్మ, శంషాన్, సుబ్బయ్య, తిరుపాలయ్య, రాములమ్మ, విజయలక్ష్మి, నారాయణ, చిన్న కాదరమ్మ తదితరులు పాల్గొన్నారు.