అన్నపూర్ణేశ్వరి రైస్‌మిల్ కాలుష్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి!
వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్‌కు 104 మంది SC కాలనీ గ్రామస్తుల వినతిపత్రం
క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు, శాస్త్రీయ వాయు నాణ్యత పరీక్షలకు డిమాండ్
సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: మదనాపురం మండలం తీర్మలయాపల్లి గ్రామంలో అన్నపూర్ణేశ్వరి రైస్‌మిల్ వెదజల్లుతున్న తీవ్ర దుమ్ము, వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోలేక తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిబంధనలను బొందపెట్టి నిర్వహణ సాగిస్తున్న ఈ రైస్‌మిల్ కాలుష్యంపై తిరుమలాయపల్లికి చెందిన SC కాలనీ వారు 104 మంది గ్రామస్తులు ఏకమై సంతకాల సేకరణ చేపట్టి, సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ కలసి అధికారికంగా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలోకి నిరంతరం వచ్చిపడుతున్న రైస్‌మిల్ దుమ్ము, ధూళి కారణంగా పరిసర ప్రాంతాలు మసిబారిపోవడమే కాకుండా,SC కాలనీ ఇళ్లలోకి సైతం దుమ్ము చేరి ప్రజలు స్వచ్ఛమైన గాలికి నోచుకోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 104 మంది సంతకాలతో కూడిన ఈ ఫిర్యాదు సమస్య యొక్క తీవ్రతకు, గ్రామంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహానికి స్పష్టమైన నిదర్శనమని కోరారు. పరిశ్రమలను లేదా ఉపాధి అవకాశాలను వ్యతిరేకించడం లేదని,కానీ ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాలు ఆర్జించే విధానాన్ని సహించేది లేదని హెచ్చరించారు.కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కాలుష్య నియంత్రణ మండలి (PCB) మరియు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి” అని డిమాండ్ చేశారు.అధికారులు కేవలం మాటలకే పరిమితం కాకుండా, శాస్త్రీయ పద్ధతిలో వాయు నాణ్యత పరీక్షలు (Air Quality Index Tests) నిర్వహించి నివేదికను పారదర్శకంగా బహిర్గతం చేయాలని తెలిపారు.గ్రామస్తుల ఫిర్యాదుపై అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, పరిశ్రమల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదని, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.సమస్యపై తక్షణమే అధికారులు స్పందించి పరిష్కారం చూపకపోతే, బాధ్యులైన రైస్‌మిల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు గ్రామస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని SC కాలనీ ప్రజలు హెచ్చరించారు.