POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:33 pm Posted by : POLITICAL POWER

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత మెరుగైన సేవలు

-ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమానికి శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రారంభం కాగా, వనపర్తిలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి పేదలకు అండగా నిలిచిందన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వనపర్తి జిల్లాలో 1,83,013 స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇందులో అర్హులైన కుటుంబాలకు కొత్తగా 26,465 రేషన్ కార్డులు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రైతుల సంక్షేమానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రైతులకు రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారూ. వనపర్తి నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గుడిసెలు లేని వనపర్తిని నిర్మించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు అందించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఆదాయ మార్గాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. వనపర్తి పట్టణంతో పాటు పెబ్బేరు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. వనపర్తిలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఐటీ టవర్, ఇందిరా మహిళా శక్తి భవనం వంటి కీలక ప్రాజెక్టులు మంజూరయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చదివిన పాఠశాల, కళాశాల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. వనపర్తిలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సంక్షేమం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి అన్ని రంగాల్లో వనపర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోబోతున్న 1.14 కోట్ల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పౌరసరఫరాల డీఎం ఆంజనేయులు, వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.