ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ప్రజలు బాధ్యతగా సహకరించాలని విజ్ఞప్తి
22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి శ్రీకారం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 220 పోలింగ్ బూత్ పరిధిలోని 22వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండాలనే లక్ష్యంతో అధికారులు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. అలాగే, మరణించిన వ్యక్తుల పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉంటే వాటి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించి, సంబంధిత అధికారులకు అందజేసి వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. అదేవిధంగా, నివాసం మారిన వారు, అర్హత లేని ఓటర్లు లేదా ఇతర మార్పులు ఉన్నట్లయితే వాటిని కూడా తెలియజేసి ఓటరు జాబితాను తప్పులులేని విధంగా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని రిహానా కమల్ పాషా పిలుపునిచ్చారు.