–థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి: ఎస్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి కే సతీష్ కుమార్ ఖమ్మం జూన్ 6 2026: జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల శ్రమ దోపిడీని తక్షణమే అరికట్టి, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. 2022లో జారీ చేసిన జీవో నెం.60 ప్రకారం బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ రూ.7,000 నుంచి రూ.11,000 వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీనిలో కాంట్రాక్టర్లతో పాటు ఆసుపత్రి అధికారుల పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అలాగే కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులతో ధోబీ పనులు చేయించడం సరైన పద్ధతి కాదని, దీనిపై ప్రశ్నించిన కార్మికులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇకపై ఇటువంటి చర్యలను ఎస్‌పీఎస్ సంఘం సహించబోదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎస్‌పీఎస్ అసోసియేషన్ అధ్యక్షులు ఈసనపల్లి అంబేద్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జననం నుంచి మరణం వరకు ప్రతి దశలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు కీలక సేవలు అందిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని అన్నారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, కార్మికులను ఐఎఫ్‌ఎంఐఎస్‌లో విలీనం చేసి ఫిక్స్‌డ్ వేతనంతో పాటు కనీసం రూ.26,000 జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్ నాగమణి, ఆర్. పద్మ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఈసనపల్లి అంబేద్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ష జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులలో ఎస్‌పీఎస్ అసోసియేషన్ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నూతన కమిటీ:
అధ్యక్షురాలు – ఐ. కుమారి, ప్రధాన కార్యదర్శి – పి. ప్రశాంత్, ఉపాధ్యక్షులు – రవి, కాసింబి, లక్ష్మి, సహాయ కార్యదర్శులు – సతీష్, కృష్ణవేణి, నాగమణి, కోశాధికారి – పి. సుకన్య.
కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నూతన కమిటీ:
అధ్యక్షుడు – సురేందర్, ఉపాధ్యక్షులు – కృష్ణయ్య, మేరీ, ప్రధాన కార్యదర్శి – ఇస్లావత్ వంశీ, సహాయ కార్యదర్శి – నాగమణి, కోశాధికారి – రమాదేవి.
పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి నూతన కమిటీ:
అధ్యక్షుడు – పాపారావు, ప్రధాన కార్యదర్శి – మహేందర్, ఉపాధ్యక్షులు – రమేష్, రవి, నాగమణి, సహాయ కార్యదర్శులు – రమలి, లక్ష్మి, శిరీష, కోశాధికారి – మహేశ్వరరావు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.