పార్టీలకతీతంగా పనిచేయాల్సిందే
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
బాధ్యత విస్మరించిన అధికారులపై కఠిన చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు
ఇకపై ప్రతి 45 రోజులకు మండల సర్వసభ్య సమావేశం
15 రోజుల ముందే సభ్యులకు సమాచారం ఇవ్వాలి
-వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: ప్రజలే ప్రభుత్వానికి యజమానులని, ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయాలు, పార్టీలు, వ్యక్తిగత అభిప్రాయాలకు ఏమాత్రం స్థానం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే అధికారుల ప్రధాన బాధ్యత అని, ఆ బాధ్యతను విస్మరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గురువారం వనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శాఖల వారిగా ఆయన ఉక్కు అంశాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖఅధికారులు యూరియా ఇబ్బందులు రాకుండా ఎరువులు, విత్తనాలు, పశువైద్య వ్యాక్సిన్లు, గడ్డి విత్తనాలు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని, మధ్యాహ్న భోజనంలో నాణ్యతను కాపాడాలని సూచించారు. డైనింగ్ హాళ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో భోజనం, వసతి సదుపాయాలను తరచూ తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు టీలేకుండా చూడాలని సూచించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే పనులను వేగవంతం చేయాలని, ఎంజే–4 ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మట్టి, ఇసుక తరలింపులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని అధికారులను ఎమ్మెల్యే స్పష్టంగా ఆదేశించారు. లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కొత్త గ్రామపంచాయతీలు, తండాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వనపర్తి జిల్లా ఆసుపత్రిలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌తో పాటు 12 రకాల పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొంటూ మంచిగా పని చేస్తున్న వైద్యాధికారులను అభినందించారు. విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్నాయని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా పైపులైన్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. సమావేశాల నిర్వహణలో కూడా క్రమశిక్షణ ఉండాలని ఎమ్మెల్యే ఆదేశిస్తూ, ఇకపై ప్రతి 45 రోజులకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని, సమావేశానికి సంబంధించిన పూర్తి అజెండాను 15 రోజుల ముందుగానే సభ్యులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధర్మం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు పనిచేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.