విద్యా అభివృద్ధికి గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత కీలకం…
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్ర మున్నూరు కాపు భవన్ లో ప్రత్యేక విద్యా వారోత్సవాల సందర్భంగా సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులకు పాఠశాల విద్యా కార్యక్రమాలపై అవగాహన కల్పించే వర్క్‌షాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వనపర్తి జిల్లా డీఈవో అబ్దుల్ గని పాల్గొన్నారు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది అని, ప్రతి గ్రామంలో విద్యా వికాసం జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చాలా అవసరమని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, స్థానిక సంస్థలు కలిసి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలల పరిస్థితిని సర్పంచులు తరచూ పరిశీలించాలని, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా పాఠశాలల పట్ల సమాజ బాధ్యతను కూడా పెంచుతున్నాయని చిన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజల విశ్వాస కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామస్థాయి అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోందని, ప్రతి శాఖ ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణలు చేపడుతోందన్నారు. విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.