POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 11:00 am Posted by : POLITICAL POWER

ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న డిఎస్ఓ

 

రూ.50 లక్షల ధాన్యం కేటాయించాల్సిన మిల్లుకు రూ. 7 కోట్లకు పైగా ధాన్యమా..?

అవినీతిలో అనకొండను మించిపోయిన డిఎస్ఓ

ఒక్కొక్కటిగా బయటపడుతున్న కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలు

ప్రజా ప్రతినిధుల కళ్ళు మూసుకుపోతున్నాయా?

జైలు ఊచలు లెక్క పెట్టించే వరకు ఉపేక్షించేది లేదు

-బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: ధాన్యం కేటాయింపుల్లో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ పై తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా రాజనగరం శివారులో గల బసవేశ్వర రైస్ మిల్లును బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో నేడు డిఎస్ఓ కాశి విశ్వనాథ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. కస్టోడియన్ గా ఉన్న మిల్లులో రూ. 9 కోట్ల ధాన్యం మాయం కావడం, తర్వాత సాంబశివ రైస్ మిల్లుకు రూ.10 లక్షల బిజీ చెల్లిస్తే రూ.6.50 కోట్ల ధాన్యం కేటాయించి అందులో రూ.3 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, తాజాగా వనపర్తి మండలం రాజనగరం శివారులోని బసవేశ్వర రైస్ మిల్లులో పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నారు. చివరి ఖరీఫ్ సీజన్లో రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీ మాత్రమే చెల్లించారని, వారికి నిబంధనల ప్రకారం రూ.50 లక్షల ధాన్యం మాత్రమే కేటాయించాలని, కానీ డిఎస్ఓ ఏకపక్షంగా వ్యవహరించి ఏకంగా రూ.7 కోట్లకు పైగా ధాన్యం కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో అనేకమంది మిల్లర్లు ఇబ్బందులు పడుతూ ధాన్యం కేటాయించమని మొరపెట్టుకున్న ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టిన డీఎస్ఓ కాశి విశ్వనాధ్, జిల్లా కలెక్టర్ తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. తమకు బిజీ చెల్లిస్తేనే ధాన్యం కేటాయిస్తామని నిరంకుశంగా వ్యవహరించిన డీఎస్ఓ,కలెక్టర్ స్థానికులకు కేటాయించకుండా గద్వాల, మెదక్ జిల్లాలకు ధాన్యం పంపించారని పేర్కొన్నారు. మరి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బసవేశ్వర రైస్ మిల్లుకు అదనంగా కోట్ల రూపాయల ధాన్యాన్ని ఏ విధంగా కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా అప్పనంగా పంచి పెడుతున్నారని, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నప్పటికీ కాశీ విశ్వనాథ్ ను వెనకేసుకొస్తూ కాపాడుతున్నాడని విమర్శించారు. డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలు ఇంకా అనేకంగా ఉన్నాయని, ప్రతిరోజు ఒక్కొక్కటిగా బీసీ పొలిటికల్ జేఏసీ బయటికి తీస్తుందని తెలిపారు. జిల్లాలో జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జి మధుసూదన్ రెడ్డి, తూడి మెగా రెడ్డి ఇలా ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి కూడా డిఎస్ఓ కాశి విశ్వనాధ్ అవినీతి అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ సొమ్మును కాపాడటానికి ఉన్నారా? లేక అవినీతి అధికారికి బాసటగా నిలుస్తారా? తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేస్తూ, ఖజానాకు గండి కొడుతున్న డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ పై తక్షణమే స్పందించి సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ అవినీతి అధికారిని ఎన్ని రోజులు రక్షిస్తారో చూస్తామని, బీసీ పొలిటికల్ జేఏసీ మాత్రం అవినీతి అధికారి కాశీ విశ్వనాథ్ ను చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్క పెట్టించే వరకు విశ్రమించదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి వి గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కృష్ణ ప్రసాద్, మోహన్ రెడ్డి, శేఖర్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.