POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 7:45 pm Posted by : POLITICAL POWER

ప్రాణాపాయ స్థితిలో తల్లీబిడ్డ.. వైద్యుల సమయస్ఫూర్తితో ఇద్దరికీ పునర్జన్మ!

క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయవంతంగా శస్త్రచికిత్స

వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనికకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందనలు

అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ ఇన్‌చార్జ్, మేడపురెడ్డి నాగార్జున:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యం, సమయస్ఫూర్తితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లీబిడ్డను కాపాడారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఇద్దరి ప్రాణాలను నిలబెట్టారు.

అశ్వారావుపేట మండలం గుంటిమడుగు గ్రామానికి చెందిన ఆశీ సమ్మక్క ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేపట్టగా, తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అప్పటికే ఆమె హిమోగ్లోబిన్ స్థాయి 8.1 నుంచి 4.8 గ్రాములకు పడిపోవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో తల్లిని కాపాడటం సవాలుగా మారింది.

ఈ సమయంలో గైనకాలజీ వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనిక సమయస్ఫూర్తితో వ్యవహరించి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం తల్లికి ఏబీ పాజిటివ్ గ్రూప్‌కు చెందిన ఒక యూనిట్ రక్తం ఎక్కించి అవసరమైన చికిత్స అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణతో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

వైద్యులకు ఎమ్మెల్యే అభినందనలు

క్లిష్ట పరిస్థితుల్లోనూ తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడిన డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనికలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యుల అంకితభావం, సేవా దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.